Jio Rockers హౌస్’ ఫుల్ టార్చర్’

‘దడ’ వంటి ఫ్లాప్ సినిమాతో తెలుగు వారికి భయంకరమైన చేదు అనుభవం మిగిల్చిన దర్శకుడు అజయ్ భుయాన్. ఆయన డైరెక్షన్లో వచ్చిన ‘హౌస్ ఫుల్’ అనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆ నలుగురు’ చిత్ర దర్శకుడు చంద్ర సిద్దార్థ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విపిన్, ఆర్యన్, వేగ, గౌరీ పండిట్ ప్రధాన పాత్రలు పోషించారు. దడ సినిమా కంటే ముందు షూటింగ్ పూర్తయినప్పటికీ ఆర్ధిక సమస్యల వల్ల వాయిదా పడుతూ ఈ రోజు విడుదలైంది. సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్ కు గురి చేసిందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం ..

కథ :

వార్నర్ బ్రదర్స్ (సత్తన్న మరియు దాసన్న) తమ 100 గజాల స్థలం సెటిల్ మెంట్ కోసం డేగ దివాకర్(అలీ) దగ్గరికి వస్తారు. డేగ వాళ్ళకి సెటిల్ చేసినట్లే చేసి ఆ స్థలాన్ని మరియు వాళ్ల దగ్గర ఉన్న డబ్బుని తెలివిగా కొట్టేస్తాడు. డేగ లవర్ అయిన అనిత అలియాస్ పోచమ్మ అక్క తార (గౌరీ పండిట్) ఆ డబ్బుని డేగ దగ్గర నుండి కొట్టేస్తుంది. ఈ డబ్బుతో తను వేరే దేశానికి పారిపోదాం అనే ప్లాన్లో ఉన్న అనితని డిటెక్టివ్ సుబ్బు (ఆర్యన్) బ్లాక్ మైల్ చేస్తాడు. సుబ్బు అనుకోకుండా చేసిన పని వల్ల అతని స్నేహితుడైన రావు (విపిన్) శాంతి (వేగ) ఎలా కలిశాడు? ఇన్ని చిక్కుముడులతో ఉన్న ఈ కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

అమాయకుడైన పాత్రలో విపిన్ నటన బాగుంది మరియు విపిన్ కి శర్వానంద్ చెప్పిన డబ్బింగ్ బాగా కుదిరింది. ఆర్యన్ నటన బాగుంది మరియు వేగ నటన పరంగా మరియు గ్లామర్ పరంగా కూడా చూడటానికి బాగుంది. చిలక రామచంద్రంగా ధనరాజ్ నటన బాగుంది. ‘ ఏది ఏమైనా ఎంత కాదన్న’ అనే పాట వినడానికి మరియు చూడటానికి బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రానికి మొదటి అతి పెద్ద మైనస్ పాయింట్ అజయ్ భుయాన్ అందించిన కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం. పాత చింతకాయ పచ్చడి లాంటి పాయింట్ ను తీసుకుని స్క్రీన్ ప్లే తో మేజిక్ చేయాలని చూసిన అజయ్ భుయాన్ మేజిక్ చేయకపోగా స్క్రీన్ ప్లే తో జనాలకు పిచ్చెక్కించాడు. మధ్య మధ్యలో పాత హాలీవుడ్ మ్యూజిక్ పెట్టి స్లో మోషన్లో తీసిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకి చిరాకు పెట్టిస్తాయి. సినిమాలో అలీ పాత్ర నిడివి ఉన్నప్పటికీ అతన్ని సరిగ్గా వాడుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. దర్శకుడికి తగ్గ ఎడిటర్ లాగా ఉన్నాడు, కత్తెరకి అసలు పనే చెప్పకుండా చూసే వారి పాపాన వారే పోతారని వదిలేసినట్టు ఉంది. థ్రిల్లర్ సినిమా అన్నప్పుడు ఆసక్తి కరంగా ఉండాలి సినిమా ఆసక్తి కరంగా లేకపోవడం, వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టించడమే కాకుండా ప్రేక్షకుల ప్రాణం తీయడానికి మధ్య మధ్యలో పాటల్ని వదిలారు.

సాంకేతిక విభాగం :

వి.ఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫి పరవాలేదనిపించాగా, మధుకర్ అందించిన డైలాగ్స్ అంత నవ్వుతెప్పించక పోయినా ఓకే అనేలా ఉన్నాయి. పాటలు బాగాలేకపోయినా పాటల్లో విశాల్ వేసిన చిన్న చిన్న సెట్స్ చూడటానికి బాగా అనిపిస్తాయి. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతంలో ‘ ఏది ఏమైనా ఎంత కాదన్న’ అనే ఒక్క పాట తప్ప మిగతా పాటలేవి ఆకట్టుకోలేదు మరియు నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.

తీర్పు :

చాలా కాలం వాయిదా పడి వాయిదా పడి ఎట్టకేలకు విడుదలైన ‘హౌస్ ఫుల్’ మూవీలో ప్రేక్షకులకు నచ్చే ఒక అంశం కూడా లేదు. ఈ వారాంతంలో మంచి సినిమా చూడాలనుకునే వారు ఈ సినిమా కాకుండా వేరే సినిమా చూసుకోవడం వారి బ్రెయిన్ కి చాలా మంచిది. ఒకవేళ ఈ సినిమా చూడాలన్న సరదా మీకు ఉన్నా థియేటర్ల కొరత వల్ల సినిమా ఎక్కడ ఉందా అని వెతుక్కొని వెళ్ళండి.

Jio Rockers