Jio Rockers తెలుగబ్బాయి – తెగ టార్చర్ పెడతాడు..

‘నచ్చావులే’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన తనీష్ ఆ తర్వాత ‘రైడ్’, ‘మేం వయసుకు వచ్చాం’ లాంటి సినిమాలతో కొంతవరకూ ప్రేక్షకులను మెప్పించినప్పటికీ ఓ సరైన హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. అందుకోసమే తనీష్ వరుసగా తను నటించిన సినిమాలను బ్రహ్మాస్త్రాల్లాగా బాక్స్ ఆఫీసు పైకి వదులుతున్నా హిట్ ని మాత్రం అందుకోలేక పోయాడు. తనీష్ మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి ‘తెలుగబ్బాయి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రమ్య నంబీసన్, తషు కౌశిక్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి అవినాష్ డైరెక్టర్. ఎస్. రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి మెజొ జోసెఫ్ సంగీతం అందించాడు. ఇంతకీ తెలుగబ్బాయి ఎలా ఉన్నాడు? తెలుగబ్బాయి తనీష్ కి అదృష్టాన్ని తెచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం….

కథ :

మూడు తరాల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి మలేషియాలో సెటిల్ అయిన ఇద్దరి ఫ్యామిలీ ల్లోని ఈ తరం జెనరేషన్ మీద నడిచే కథే ఈ సినిమా. నాగబాబు మలేషియాలో ఫేమస్ రెస్టారెంట్ ఓనర్. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన అతని కూతురు చందమామ అలియాస్ బులెన్(రమ్య నంబీసన్), వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ కావాలనుకునే అరుణ్(తనీష్) చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహితులు. అరుణ్ మోడల్ అయిన మేఘ(తషు కౌశిక్) ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ మేఘకి అరుణ్ కి మనస్పర్ధలు వచ్చి మేఘ అరుణ్ ని వదిలి వెళ్ళిపోతుంది. ప్రేమ విఫలమైందని బాధ పడుతున్న అరుణ్ కి బులెన్ తను ప్రేమిస్తున్నానని చెబుతుంది. దాంతో అరుణ్ – బులెన్ మధ్య ప్రేమ చిగురిస్తూ ఉన్న తరుణంలో అరుణ్ జీవితంలోకి మళ్ళీ మేఘ వస్తుంది. మేఘ రావడం వల్ల అరుణ్ – బులెన్ మధ్య ఏం జరిగింది? అసలు మేఘ అరుణ్ తో ఎందుకు విడిపోయింది, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది? చివరికి అరుణ్ ఎవరిని తన లైఫ్ పార్టనర్ గా ఎంచుకున్నాడు అనేదే మిగిలిన కథ..

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ అంటే … హా ఈ సినిమాకి చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ అంటే రమ్య నంబీసన్, ఆమె నటన చాలా బాగుంది. ఆమెకి ఒక పెద్ద సినిమా ఆఫర్ వస్తే మాత్రం స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. సెకండ్ హీరోయిన్ అంటే గ్లామర్ కోసమే అనే విషయాన్ని బాగా తెలుసుకున్న డైరెక్టర్ తషు కౌశిక్ ని బాగా గ్లామరస్ గా చూపించారు. ఇక తనీష్ నటన ఎలా ఉంది అంటే సేమ్ యాసిటీజ్ గా ఉంది.. నటనలో కొత్తగా ఇది ఉంది అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా తనీష్ కాస్త లుక్ మార్చి స్టైలిష్ లుక్ తో కనిపించాడు.

మైనస్ పాయింట్స్ :

మన తాతల కాలం నుంచి వస్తున్న అదే పాత చింతకాయ పచ్చడి కథకి మలేషియా కోటింగ్ ఇచ్చి, దానికి ఏ లవ్ స్టొరీ అనో, ప్రేమ కథ అనో టైటిల్ పెడితే ప్రేక్షకులు కథని గెస్ చేస్తారని ‘తెలుగబ్బాయి’ అని టైటిల్ పెట్టి మన మీదకి వదిలారు. సరే టైటిల్ ఎలా ఉన్నా, కథ ఎలా ఉన్నా రాసుకున్న సీన్స్ లో అయినా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే లేకపోవడం, డైరెక్షన్ లో పర్ఫెక్షన్ లేకపోవడం, అన్నిటికీ మించి సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. అలా అని సెంటిమెంట్, ట్రాజిడీ తో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించారనుకుంటే మాత్రం హుస్సేన్ సాగర్లో కాలేసి నట్టే అలా అని ట్రాజిడీ లేదని కాదు ఉంది ఆ ట్రాజిడీ చూస్తే మీకు మీ మీదే జాలేస్తుంది. ఎంచుకున్న ప్లాట్ ని డైరెక్టర్ డీల్ చేయలేక పోయిన సంగతి సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమైపోతుంది.

సినిమాలో రెండు లవ్ ట్రాక్స్ ఉన్నాయి కానీ ఒక్క లవ్ ట్రాక్ ని కూడా సరిగ్గా డీల్ చెయ్యలేదు. హీరోయిన్ డ్రెస్, పార్ట్స్ గురించి హీరో చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పే సీన్ ని సెన్సార్ వాళ్ళకి కూడా ఏదో ఒక పని ఉండాలి కదా అనే పెట్టినట్టు ఉంటుంది. సినిమా మొదట్లో హీరో లక్ష్యమేమో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అని చూపిస్తారు కానీ చివరికేమో మోడల్స్ కి ఫోటో తీసుకునే ఫోటో స్టూడియో పెట్టుకుంటాడు అదేమీ లాజిక్కో అది డైరెక్టర్ కన్నా అర్థమయ్యిందో లేదో మరి. సినిమాలో మీకు కంటిన్యూ వీడియో కంటే కెమెరాలో తీసిన ఫోటో ఫ్రేమ్స్, కెమెరా క్లిక్ శబ్దాలే ఎక్కువగా కనిపిస్తాయి మరియు వినిపిస్తాయి దానికి తోడు కెమెరా షేకింగ్, మధ్య మధ్యలో హ్యాపీ డెంట్ యాడ్ లో వచ్చినట్టు స్పార్క్స్ రావడం ప్రేక్షకులకు స్క్రీన్ చించేయాలన్నంత కోపాన్ని తెప్పిస్తాయి.

మాములుగా నాకు తెలిసి తాబేలు చాలా చిన్నగా నడుస్తుందని అంటుంటారు దాని నడకకన్నా స్లోగా, పెట్రోల్ లేని బండి ముందుకు వెనక్కి జర్క్ లు ఇచ్చినంత స్లోగా సినిమా ఉంటుంది. సినిమా మొదలైన కొద్ది సేపటి తర్వాత నుండి ఇంటర్వల్ ఎప్పుడు ఇస్తారా అని, ఇంటర్వల్ తర్వాత సినిమా ఎప్పుడు అయిపోతుందా థియేటర్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనే ఆలోచనతో ప్రేక్షకులు సినిమా చూస్తారు. మలేషియా నుంచి తీసుకున్న కొంత మంది ఆర్టిస్ట్స్ , అలాగే కమెడియన్ వేణు ని పెట్టుకొని కూడా కామెడీ విషయంలో సక్సెస్ కాలేకపోయారు. కొన్ని సీన్స్ లో డైలాగ్స్ ఎక్కడో బ్యాక్ గ్రౌండ్ లో వినపడుతుంతాయి. అలాగే సీన్ టు సీన్ లాజిక్ కావాలి అనుకునే వారికి చాలా లాజిక్స్ కి సమాధానం దొరకదు.

సాంకేతిక విభాగం :

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ మొత్తం నాలుగు విభాగాలను ఒక్కడినే ఎందుకు డీల్ చెయ్యలేననే నమ్మకంతో సినిమా మొదలు పెట్టిన డైరెక్టర్ అవినాష్ సినిమా పూర్తయ్యేటప్పటికి ఒక్కదాన్ని కూడా సరిగ్గా నిర్వర్తించలేక బొక్క బోర్లాపడి తన కెరీర్ కి తానే చరణ గీతం పాడుకున్నాడు. కొన్ని కొన్ని చోట్ల కొన్నిప్రదేశాలను బాగానే చూపించిన సినిమాటోగ్రాఫర్ కొన్ని సీన్స్ ని కెమెరా షేక్ చేసి, కెమెరా టైపులో క్లిక్ చేసి చూపించి చిరాకు తెప్పించారు. నాకు తెలిసి ఎడిటర్ కి మూవీ రన్ టైం ఎక్కువైనా పర్లేదు తీసింది మొత్తం రావాలన్నారేమో అందుకే ఆయన కత్తెరకి పెద్దగా పని పెట్టకుండా సింపుల్ గా సీన్స్ జాయిన్ చేసి పంపేశాడు. మెజొ జోసెఫ్ అందించిన ఒకటి రెండు పాటలు బాగానే ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ లో మాత్రం మ్యూజిక్ కంటే క్లిక్ క్లిక్ అనేదే ఎక్కువ వినిపిస్తుంది. పాటలు ఎలా ఉన్నా డాన్స్ మాస్టర్ మాత్రం కొరియోగ్రఫీతో కొంత వరకూ ఆకట్టుకున్నాడు. మలేషియాలో తీయడం వల్ల నిర్మాణ విలువలు బాగానే వున్నాయి కానీ మలేషియా కాకుండా ఇంక్కడే ఎక్కడన్నా ప్లాన్ చేసుకొని ఉంటే నిర్మాతకి కాస్త ఖర్చైనా తగ్గేది.

తీర్పు :

పాత చింతకాయ పచ్చడి లాంటి టై యాంగిల్ లవ్ స్టొరీ కథతో తీసిన తెలుగబ్బాయి సినిమాలో రమ్య నంబీసన్ నటన తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లు ఈ సినిమాకి మేజర్ మైనస్. అలాగే కామన్ ఆడియన్ ఆశించే కామెడీ, సెంటి మెంట్, ఫైట్స్ లాంటి ఏమీ ఈ సినిమాలో ఉండవు. కావున ఈ సినిమా చూడాలా వద్దా అనే విషయాన్ని మీ ఊహా శక్తికే వదిలేస్తున్నా..

Jio Rockers