Jio Rockers కేస్ నెం 666/2013 – అసలు విచారణే లేని కేసు.!

దర్శకులు, నిర్మాత, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరూ కొత్త టెక్నీషియన్స్ తో ఒక వీడియో ఫుటేజ్ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘కేస్ నెంబర్ 666/2013’. టీవీ యాక్టర్ నందకిషోర్ తో పాటు నూతన నటీనటులు ఆదిత్య, అశ్విని, చరణ్ తేజ్, గురు చరణ్, నిఖిత ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి, పుర్నేష్ కొణతల సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాని అశోక్ బాబు నిర్మించాడు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఇంతకీ ఈ కేస్ నెంబర్ 666 విచారణ ఏంటో ఇప్పుడు చూద్దాం…

కథ :

భాస్కర్, చైతన్య, దుర్గ అనే ముగ్గురు స్నేహితులు హైదరాబాద్ సిటీలో వేరు వేరు ఉద్యోగాలు చేసుకుంటూ ఒక అపార్ట్ మెంట్లో నివసిస్తుంటారు. అదే బిల్డింగ్ లో పక్క అపార్ట్ మెంట్లో చేరిన రమేష్ తో పరిచయం ఏర్పడుతుంది. వీరందరూ ఒకరోజు తాగుతూ దెయ్యాల గురించి మాట్లాడుకుంటారు. అందులో రమేష్ దెయ్యాలున్నాయి, నేను చూశాను అంటే, దెయ్యాలు లేవని కావాలంటే నిరూపిస్తాం అని భాస్కర్, చైతన్య, దుర్గ కలిసి రమేష్ తో పందెం కాస్తారు. ఆ పందెంలో భాగంగానే వారు నర్సాపూర్ అడవిలోని ఓ గెస్ట్ హౌస్ కి వెళ్తారు. అలా వెళ్తున్న వీళ్ళ గ్యాంగ్ లోకి ఆనంద్ అనే ఒక వ్యక్తి వచ్చి చేరుతాడు. ఇంతకీ ఈ ఆనంద్ ఎవరు? అసలు వీళ్ళతో ఎందుకు కలిశాడు? భాస్కర్, చైతన్య, దుర్గ ఆ అడవిలో దెయ్యాలు లేవని నిరూపించి పందెం గెలిచారా లేక ఆ దెయ్యానికి బలైపోయారా అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక రెండు నిమిషాలు బాగుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా ప్రేక్షకులని బయపెట్టాలని చేసిన రెండు సీన్స్ బాగున్నాయి. ఆనంద్, దుర్గ పాత్రలు చేసిన వారి నటన బాగుంది. సినిమాలో వీణ పాత్ర పోషించిన అమ్మాయి బాగుంది కానీ ఆమె సినిమా మొదట్లో – చివర్లో వస్తుంది. సెకండాఫ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి పెద్ద మైనస్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో విషయం ఏమీ ఉండదు. సినిమా చూసే వాళ్ళందరూ వెళ్లమ్మా ముందుకు వెళ్ళూ అని బలంగా తోస్తే కానీ ముందుకు వెళ్ళదు. ఫస్ట్ హాఫ్ ని అంతగా సాగదీశారు. సరే సెకండాఫ్ మొదలు పెట్టాడు పరవాలేదు బాగానే సాగుతోంది అని అనుకునే లోపే అసలు సినిమాలో సస్పెన్స్ ఏమిటా అనేది సామాన్య ప్రేక్షకుడికి అర్థమయిపోతుంది. దానికి తగ్గట్టు క్లైమాక్స్ లో సస్పెన్స్ రివీల్ చేసే సీన్స్ ఆసక్తికరంగా లేకపోగా ప్రేక్షకులు నీకన్నా మేమే క్లైమాక్స్ ని బాగా ఊహించుకున్నాం అని లేచి వెళ్లిపోయేలా ఉంటుంది. సెకండాఫ్ మొత్తం నటీనటుల ముఖాల కంటే వారి కాళ్ళు, చీకటే ఎక్కువగా కనిపిస్తుంది అది ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అంటే రొటీన్ కాన్సెప్టులే ఉంటాయి కానీ దర్శకుడు ప్రేక్షకుడికి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠకు లోనయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకుంటేనే సినిమా విజయం సాధిస్తుంది. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే అంత ఉత్కంఠతను కలిగించకపోగా నెక్స్ట్ ఏంటి అనేది మనకు తెలిసిపోయేలా ఉంటుంది. సినిమాలో కెమెరాని నటీనటులే వాడుతున్నట్టు చూపించడం వల్ల సినిమాలో పెట్టిన కెమరా యాంగిల్స్ చిరాకు తెప్పించడమే కాకుండా, ఇలాక్కూడా కెమెరా యాంగిల్స్ పెట్టొచ్చు, పెడితే ఎంత విచిత్రంగా ఉంటాయో మీరు ఈ సినిమాలో చూడొచ్చు. ఎంత మాత్రం వాటర్ ప్రూఫ్ కెమెరా వాడాడని కెమరాని ఫ్రిజ్ లో, నీటి తొట్టెలో పెట్టి షూట్ చెయ్యడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనేది దర్శకులకే తెలియాలి.

కొన్ని సన్నివేశాలకు సరైన లింక్స్ ఉండవు. జరనలిస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉప్పు కారం లేని చప్పిడి కూరలా ఉంటుంది. సినిమాలో కామెడీ కూడా లేదు. అలాగే పోలీసులు మర్డర్స్ జరిగిన కేసుపై దర్యాప్తు చేయకపోగా దాని గురించి జర్నలిస్ట్ అడిగితే వారికి అలానే కావాలి, మంచిపనే జరిగింది అని భాద్యతారహితంగా మాట్లాడి మీడియా వాళ్ళని తరిమేయడం, క్లైమాక్స్ లో తన తోటివారిని చంపేస్తుంటే ఆనంద్ వారిని కాపాడటం మానేసి పక్కకి వచ్చి కెమెరాలోకి చూస్తూ తన ప్రేమికురాలిని గుర్తుకు తెచ్చుకొని నిన్ను మిస్ అవుతున్నాని అని చెప్పడంలో లాజిక్ ఏమిటనేది దర్శకుడికే తెలియాలి. ఇక చెప్పలేను అందుకే ఇక్కడితో ఆపేస్తున్నా.

సాంకేతిక విభాగం :
వారు అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం సినిమాటోగ్రఫీ పరవాలేదనుకున్నా చూడటానికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎడిటర్ పనితనం చాలా నాశిరకంగా ఉంది. ఎతిరాజ్, శ్యామల్ సంగీతంలో పాటలేమీ లేవు, సెకండాఫ్ లో చాలా సీన్స్ కి వీరిచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది. కథ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈ మూడు విభాగాల్లో ఏదీ ఆకట్టుకునేలా లేదు. డైరెక్టర్ ఏదో త్వరగా తీసెయ్యాలని తీసేశాడు. ఇంకాస్త టైం, స్క్రీన్ ప్లే మీద శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. అలాగే ఇద్దరు దర్శకులు తీయడం వల్ల చాలా సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అయ్యాయి.

తీర్పు :
నూతన నటీనటులతో నూతన టెక్నీషియన్స్ తో తీసిన ఈ సినిమాలో కామన్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఏమీలేవు. అలా అని సస్పెన్స్ థ్రిల్లర్స్, కొత్తరకం కోరుకునే ఆడియన్స్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చూడొచ్చు. కావున ఈ సినిమా చూడాలా? వద్దా? అనే విషయాన్ని మీ ఇష్టానికే వదిలేస్తున్నా..

Jio Rockers